ఇసుకను అందుబాటులో ఉంచండి – సీఎం
సీఎస్ ను ఆదేశించిన చంద్రబాబు నాయుడు
అమరావతి – రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చూడాలని….ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మైనింగ్ శాఖపై సిఎం సచివాలయంలో సమీక్ష చేశారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులో వస్తాయని సమీక్షలో అధికారులు వివరించారు.
ఈ రీచ్ ల ద్వారా రోజూ 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 30,000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని…కొత్తగా అందుబాటులోకి వచ్చే రీచ్ లతో అదనంగా 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని వివరించారు.
ఇసుక బుకింగ్ సౌలభ్యాన్ని మెరుగు పరచడానికి ఆన్ లైన్ పోర్టల్ తో పాటు రీచ్‌ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా ఆన్‌లైన్ పోర్టల్ నుండి బుక్ చేసుకోలేని వారు నేరుగా ఇసుక రీచ్‌కు వెళ్లవచ్చునని తెలిపారు.
ఇసుక రీచ్‌లను డిస్టిక్ లెవల్ శాండ్ కమిటీ ఎంపిక చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఏజెన్సీలను డిస్టిక్ లెవర్ శాండ్ కమిటీ టెండర్ల ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తుందని తెలిపారు.
ర్యాంప్ ల ఏర్పాటు, రీచ్ ల నిర్వహణ వ్యవహారాలు వీరు చూస్తారని వివరించారు. ఇసుక రీచ్‌లోని ఇసుక స్టాక్ పాయింట్‌ను 24 గంటలు ఆపరేట్ చేయడానికి వారిని అనుమతిస్తామని, తద్వారా నిరంతర సరఫరాను కొనసాగించవచ్చు అన్నారు .
పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను త్వరితగతిన అనుమతించడం ద్వారా మార్కెట్‌లో ఇసుక లభ్యత పెంచబోతున్నట్లు వివరించారు. అయితే ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని…దీని నిరంతర నిఘాతో పాటు నిత్యం పర్యవేక్షణ చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.
ఇసుక లభ్యత, రవాణా ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు మొదలైన వాటి గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని పంపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చెకింగ్, GPS ట్రాకింగ్, ఆడిట్ ల ద్వారా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూడాలని సిఎం ఆదేశించారు.