DEVOTIONAL

ఎవ‌రైనా స‌రే టీటీడీ నియ‌మాలు పాటించాల్సిందే

Share it with your family & friends

నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న
అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదం గురించి చ‌ర్చించు కుంటున్నార‌ని, దీనిపై తాము ఇప్ప‌టికే సిట్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా కలియుగ వైకుంఠమైన తిరుమలపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమ‌ని పేర్కొన్నారు.

ఈ దివ్య క్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమ‌ని తెలిపారు సీఎం. ఏడు కొండల వాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు త‌మ‌ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామి వారిని కొలుస్తారని తెలిపారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు.

శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమ శాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానని అన్నారు సీఎం. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. అలా వ్య‌వ‌హ‌రిస్తే తీవ్ర చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు నారా చంద్ర‌బాబు నాయుడు.