ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – సీఎం చంద్రబాబు చిలుక పలుకులు పలికారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం గురించి ప్రస్తావించారు. తాను ఏనాడూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించ లేదని చెప్పారు. ఏపీ ప్రతిపాదించిన బనకచర్లపై ఫిర్యాదు చేయడంపై స్పందించారు. చివరి ప్రాంతాలకు మిగులు జలాలను తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. పోలవరం సముద్రంలోకి పోయే నీటిని కరవు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వృధా నీటిని తీసుకు వెళితే కొందరు రాజకీయం చేయడం దారుణమన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ అక్రమంగా తమ నీటిని తరలించుకు పోతోందంటూ తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర జల శక్తి, నీటి పారుదల శాఖ మంత్రికి తమ వాటా తేల్చాలని, ఏపీపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
మరో వైపు తెలంగాణలో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో తాగు, సాగు నీరందక జనం, రైతులు లబోదిబోమంటున్నారు. ఇంకో వైపు తన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో ఎంచక్కా నీటి చౌర్యానికి పాల్పడింది ఏపీ సర్కార్. దీనిపై మనోడు ఇంకా నోరు విప్పడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.