ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రమాదం
అందుకే రద్దు చేశామన్న సీఎం
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం శాసన సభలో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరంగా తయారైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ పూర్తిగా మద్దతు తెలిపిందన్నారు సీఎం.
కూటమి అధికారం లోకి వచ్చిన వెంటనే చట్టాన్ని రద్దు చేస్తామని తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసి తీరామన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఇచ్చిన హామీ ప్రకారం నల్ల చట్టాన్ని రద్దు చేయడానికి బిల్లు పెట్టామన్నారు. ఈ చట్టం కారణంగా రాష్ట్రం లో ఎప్పుడు లేనంతగా భూ వివాదాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. 40 ఏళ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పుం నియోజక వర్గంలో ఒక్క పిర్యాదు రాలేదని గుర్తు చేశారు.
కానీ గత ఐదేళ్లుగా నా నియోజకవర్గంలో భూ వివాదాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. టెక్నాలజీ చాలా ప్రమాదకరమైనదని, భూమి అనేది వారసత్వ ఆస్తి అని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. విచిత్రం ఏమిటంటే గత సీఎం తన ఫోటోను పాసు పుస్తకాలపై వేసుకున్నారంటూ ఎద్దేవా చేశారు.