సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశం
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నాలుగు రోజుల పాటు పల్లెల్లో నిద్ర చేయాలని ఆదేశించారు. తన ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. కీలక అంశాలపై చర్చలు జరిపారు. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించాలని, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయాలన్నారు సీఎం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లబ్దిదారులు అత్యధికంగా ఉన్నారని, అయినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. చేసిన మంచి పనులకు విస్తృత ప్రచారం కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు.
కేబినెట్ మీటింగ్ అనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో విశాఖ ఋషికొండపై సీరియస్ గా చర్చించారు. రాష్ట్ర ఖజానాపై భారం పడినా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత తమ రాష్ట్రానికే దక్కిందన్నారు. ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. విజన్ 2047 తో ముందుకు వెళుతున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. గత సర్కార్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు.