NEWSANDHRA PRADESH

బాధితుల‌కు చంద్ర‌బాబు భ‌రోసా

Share it with your family & friends

పార్టీ ఆఫీసులో విన‌తుల స్వీక‌ర‌ణ

అమ‌రావ‌తి – వివిధ స‌మ‌స్య‌లతో వ‌చ్చిన బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ‌నివారం మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యానికి ఆయ‌న విచ్చేశారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను క‌లిసిన ప్ర‌జ‌ల‌తో ఆయ‌న ముచ్చ‌టించారు.

ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తి గత సమస్యలపై ప్రజలు సిఎంకు విన్నవించారు.

కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం లో పనిచేసిన బీమా మిత్రలు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్, మహ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు.

ఫర్నిచర్ షాపు నడుపుతున్న వీరు లక్ష విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఆశోక్ బాబుతో సహా పలువరు నేతలు పాల్గొన్నారు.