జగన్ మోహన్ రెడ్డిపై దాడి
ప్రస్తుతం సీఎం క్షేమం
విజయవాడ – రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా బస్సు యాత్ర చేపట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఇది నేరుగా జగన్ రెడ్డి నుదుటికి తాకింది. బలమైన గాయం కావడంతో సీఎంను హుటా హుటిన బస్సులోకి తరలించారు. అక్కడే ఉన్న వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించారు. ఇదంతా జగన్ రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి తట్టుకోలేక కొందరు కావాలని దాడికి పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపించింది.
ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే జగన్ మోహన్ రెడ్డి కంటికి గాయమయ్యేదని వైసీపీ పేర్కొంది. ఆయన ఎడమ కనుబొమ్మకు బలంగా రాయి తగిలింది. వెంటనే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ప్రథమ చికిత్స అనంతరం కొంచెంత సేపు విశ్రాంతి తీసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి.
ఆ వెంటనే వైద్యులు , భద్రతా సిబ్బంది సూచించినా పట్టించు కోలేదు ఏపీ సీఎం. తిరిగి ప్రచారంలో మునిగి పోయారు. బస్సు యాత్ర కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా సీఎం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా గాయమైనట్లు సమాచారం.
ఏపీ సీఎం జగన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.