తిరుమల పవిత్రత కాపాడేలా కృషి చేయాలి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశం
తిరుమల – తిరుమల పవిత్రతను కాపాడేలా కృషి చేయాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. సమీక్షకు హాజరైన మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు .
ఈ సందర్బంగా సీఎం పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. కొండపై గోవింద నామ స్మరణ తప్ప మరో మాట వినిపించ కూడదని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగ కూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దు అని పేర్కొన్నారు సీఎం. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని…ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని పేర్కొన్నారు.
అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతం పైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు.బయో డైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగారు.
టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై అడిగారు. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని ఆదేశించారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని అన్నారు.
ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకు రావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని ఆదేశించారు సీఎం. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారని….ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి…మరింత మెరుగు పడాలన్నారు.
ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని..అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలన్నారు . తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలన్నారు…ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించ కూడదన్నారు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలన్నారు..ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని సూచించారు నారా చంద్రబాబు నాయుడు.
టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే వారిని గౌరవించు కోవాలన్నారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండ కూడదన్నారు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు. తిరుమల పేరు తలిస్తే….ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలన్నారు.
స్విమ్స్ సేవలు కూడా మెరుగు పరచాలని అన్నారు…..ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ (స్వచ్చంద సేవను ) మరింత బలోపేతం చేయాలని అన్నారు.