ఎర్రన్నా నిను ఎలా మరిచి పోగలను
ఘనంగా నివాళి అర్పించిన చంద్రబాబు
అమరావతి – కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు 12వ వర్ధంతి ఇవాళ. ఈ సందర్బంగా ఏపీ టీడీపీ చీఫ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎర్రన్నాయుడును ఎలా మరిచి పోగలనంటూ పేర్కొన్నారు. పార్టీ పటిష్టత కోసం ఎంతగానో కష్టపడ్డారని, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన అత్యంత ఆప్తుడైన నాయకుడని పేర్కొన్నారు.
తను మరిచి పోలేని వ్యక్తులలో కింజారపు ఎర్రన్నాయుడు కూడా ఒకరని తెలిపారు. అనునిత్యం ప్రజల కోసం పరితపించిన ఆయన ప్రజల సేవలోనే తుది శ్వాస విడిచారని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.
తెలుగు ప్రజలకు, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు ఏపీ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ కి అంకిత భావంతో సేవలు అందించిన నాయకుడుగా కూడా ఆయన చిరకాలం గుర్తుండి పోతారని పేర్కొన్నారు. తరాలు గడిచినా తరగని ఖ్యాతి పొందిన ఆయన భౌతికంగా మన మధ్య లేక పోయినా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచి పోతారని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.