పులివెందులలో జగన్ నామినేషన్
భారీగా తరలి వచ్చిన జనం
కడప జిల్లా – వైఎస్సార్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అశేష జన సంధ్రం మధ్య నామినేషన్ వేశారు. పులివెందుల శాసన సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు వైసీపీ ఆధ్వర్యంలో. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు జగన్ వెంట నడిచారు.
ఎన్నికల సంఘం రూల్స్ మేరకు ఐదుగురి కంటే ఎక్కువ ఉండకూడదు. జగన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. కడప లోక్ సభ స్థానం నుంచి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రంగంలో ఉంది.
ఏపీలో ఈసారి ఎన్నికలు మరింత ఛాలెంజ్ గా మారాయి జగన్ మోహన్ రెడ్డికి. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. అయినా ఎక్కడా తగ్గడం లేదు. తాను చేపట్టిన సంస్కరణలు, తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే గట్టెక్కిస్తాయని, మరోసారి సీఎంగా పదవీ ప్రమాణం చేస్తానని ధీమాతో ఉన్నారు సీఎం.