క్రీడాభివృద్దికి ఏపీ సర్కార్ చేయూత
స్పష్టం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
విశాఖపట్నం – క్రీడాభివృద్దికి తమ సర్కార్ ఎనలేని కృషి చేస్తోందన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు సీఎం.
గ్రామ, వార్డు స్ధాయి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం, వ్యాయామం, క్రీడల పట్ల అవగాహన పెంచడం చాలా అవసరం అన్నారు. గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలన్నారు.
సానపట్టి, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ప్రతిభ చూపే ఛాన్స్ ఉందన్నారు. ఇందులో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నామన్నారు.
ఇందులో దాదాపుగా 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారని తెలిపారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయని వెల్లడించారు. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలోనూ, 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగాయన్నారు సీఎం. మొత్తం 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరిగిందన్నారు.
దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చామన్నారు.
రూ.12.21 కోట్ల బహుమతులు విజేతలకు ఇవ్వడం జరిగిందన్నారు ఏపీ సీఎం. చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితో పాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్ కలిగిన 14 మందిని దత్తత తీసుకుంటాయని పేర్కొన్నారు.