చిత్తూరు చెంతకు కృష్ణమ్మ జలాలు
ఇచ్చిన మాట నెరవేర్చానన్న జగన్
చిత్తూరు జిల్లా – కృష్ణా జలాలను చిత్తూరు జిల్లాకు తీసుకు వస్తానన్న సంకల్పం ఆచరణలో సాధ్యమైందని, ఇచ్చిన మాట తప్పనని ఇవాల్టితో రుజువైందని అన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తాగు, సాగు నీటి కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను సాకారం చేశానని ఇది తన జీవితంలో మరిచి పోలేనంటూ పేర్కొన్నారు సీఎం.
కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల ఖర్చుతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గానికి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేశారు జగన్ రెడ్డి.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధులు పారే ప్రాజెక్టుగా మార్చుకున్నాడంటూ ఆరోపించారు. కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడని ఇప్పటి దాకా ఒక్క నీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా అని ప్రశ్నించారు.