ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – ఏపీ సీఎం జగన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేమంతా సిద్దం పేరుతో జగన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు తగిలిన గాయం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని, కూటమి నేతలవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు.
నా నుదుటి మీద వాళ్లు చేసిన గాయం 10 రోజుల్లో తగ్గి పోతుందని అన్నారు. కానీ పేదలకు , ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు చేసిన గాయాలను , మోసాలను ఎప్పటికీ మరిచి పోలేరని అన్నారు. గాయ పర్చడం, మోసం చేయడం, తన వారికి సంపదను , వనరులను కట్ట బెట్టడం బాబు నైజమని ధ్వజమెత్తారు.
తాము ఎప్పుడూ మోసానికి పాల్పడ లేదన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా తాను ముందుకు వెళుతున్నానని అన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు పర్చిన ఘనత తమదేనని స్పష్టం చేశారు.
తాము తీసుకు వచ్చిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శ ప్రాయంగా మారిందని అన్నారు జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు. ఆయనను జనం నమ్మరని అన్నారు. ఇక కూటమి నేతల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.