బాబుకు ఓటేస్తే పథకాలు బంద్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా – టీడీపీ కూటమికి ఓటు వేస్తే సంక్షేమ పథకాలకు చెక్ పెట్టినట్టేనని హెచ్చరించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని రీతిలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత తమ సర్కార్ కే దక్కుతుందన్నారు సీఎం.
టీడీపీ కూటమి వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీఎంగా ఏపీకి ఏం చేశారంటూ ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయల అప్పులు చేశాడని, తమపై భారం మోపాడని ఆరోపించారు. ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పాల్గొని ప్రసంగించారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోందని అన్నారు. ఈ రోజు జరగబోతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు అన్నారు జగన్ రెడ్డి.
ఇవి రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.