రూ. 78.53 కోట్ల ఆర్థిక సాయం
అమరావతి – వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద మంగళవారం తన కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేశారు.
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ వచ్చామన్నారు ఈ సందర్బంగా జగన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు షాదీ తోఫా అండగా నిలుస్తుందన్నారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు పదవ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించింది జగన్ సర్కార్. రూ. 15,000 జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్ వరకూ కూడా ఇస్తోంది. 17 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి ఇంటర్ చదువు కూడా పూర్తవుతుంది.
ఇక జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా రూ. 20,000 వరకు ఆర్ధిక సాయం సర్కార్ అందిస్తోంది. ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 427.27 కోట్లు జమ చేసింది.