ఏపీలో కూటమి ఆటలు సాగవు
సీఎం జగన్ మోహన్ రెడ్డి కామెంట్
అమరావతి – రాష్ట్రంలో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తోందని కానీ వారి ఆటలు సాగవన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జగన్ రెడ్డి ప్రసంగించారు.
మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఇవాళ ప్రభుత్వ పరంగా లబ్ది పొందని కుటుంబం అంటూ లేదన్నారు. ఈ ఘనత ఒక్క రాజశేఖర్ బిడ్డకు దక్కుతుందన్నారు.
ఇవాళ తాము ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను చూసి కేంద్రం ప్రశంసలు కురిపించిందన్నారు. గత కొంత కాలంగా సదరు వ్యవస్థను తూల నాడిన వాళ్లే ఇప్పుడు కొనియాడుతున్నారని దీనిని బట్టి చూస్తే వారు ఎంత నీచ స్థాయికి దిగజారారో అర్థం అవుతుందన్నారు జగన్ మోహన్ రెడ్డి.
ప్రజలకు పూర్తిగా తెలిసి పోయిందని, ఎవరు పనిచేస్తారో ఎవరు పని చేయడం లేదనేది. తమకు 170 సీట్లకు పైగా అసెంబ్లీలో సీట్లు వస్తాయని, ఇక లోక్ సభ స్థానాలకు సంబంధించి 22 కంటే ఎక్కువగానే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.