వీసీలకు షాక్ హెడ్ క్వార్టర్స్ వీడొద్దు
ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కీలక నిర్ణయాలు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు బిగ్ షాక్ తగిలింది. తమకు సెలవులు మంజూరు చేయాలని కోరిన సీనియర్లకు ఝలక్ ఇచ్చింది సర్కార్. ఎవరూ కూడా ఏపీని విడిచి వెళ్ల కూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొలువు తీరారు నీరబ్ కుమార్ ప్రసాద్. ఈ మేరకు ఆయన సంతకం చేసిన వెంటనే కీలక ప్రకటన చేశారు. పలువురికి స్థాన చలనం కలిగించారు. మరికొందరు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదే సమయంలో ఆదివారం మరో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీలకు సంబంధించి వైస్ ఛాన్సలర్లు హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్, ఎస్పీలను సంప్రదించి పరిష్కరించు కోవాలని సూచించారు. శాఖా పరమైన సమస్యలకు ఉన్నత విద్యా శాఖతో మాట్లాడాలని పేర్కొంది ప్రభుత్వం. ఇదిలా ఉండగా ఆంధ్రా యూనివర్శిటీలో కీలక పత్రాలు మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కీలక ఆదేశాలు జారీ కావడం విశేషం.