మేం రాజకీయ ఒత్తిళ్లతో పని చేయం – డీజీపీ
డిప్యూటీ సీఎం కామెంట్స్ పై స్పందన
అమరావతి – రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా పని చేయడం లేదని, యూపీలో లాగా బుల్డోజర్ పాలన రావాలని, అసలు హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి ఏం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతే కాకుండా రాజకీయ ఒత్తిళ్లతో ఏమైనా చర్యలు తీసుకోవడం లేదా అంటూ పోలీసులకు చురకలు అంటించారు. ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఒకవేళ తానే హోం శాఖ మంత్రినైతే సీన్ ఇలా ఉండదని కూడా అన్నారు.
దీంతో కూటమి సర్కార్ లో తీవ్ర దుమారం రేగింది పవన్ చేసిన కామెంట్స్. మంగళవారం ఏపీ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు తీవ్రంగా స్పందించారు. ఒక రకంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణే తమ విధానం అని స్పష్టం చేశారు .
తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని, కానీ రాజకీయ ఒత్తిళ్లతో తాము పని చేయమని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే తాము పని చేస్తామని, కేసు విచారిస్తామని చెప్పారు డీజీపీ. అయితే గత సర్కార్ హయాంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని అన్నారు.