యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ – డీజీపీ
మదనపల్లె ఘటనపై సీరియస్ కామెంట్స్
అమరావతి – ఏపీ డీజీపీ తిరుమల రావు కీలక వ్యాఖ్యలు చేశారు మదనపల్లె ఘటనపై. అది యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ అంటూ స్పష్టం చేశారు. మీడియాతో డీజీపీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని, ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గత రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందన్నారు డీజీపీ.
3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. 22ఏ భూముల రికార్డులున్న గదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందన్నారు. కీలక సెక్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు తిరుమల రావు.
ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వ లేదని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వక పోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదన్నారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పారని తెలిపారు డీజీపీ. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని, కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయని తెలిపారు.
ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయని, ఈ నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశామన్నారు డీజీపీ.