48 గంటల్లో భారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక
అమరావతి – దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం కారణంగా 48 గంటల్లో తమిళనాడు తో పాటు ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
డిసెంబర్ 15 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ రోణంకి కూర్మనాథ్. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు.
మంగళవారం కోస్తా , రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెదురు మదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముందు జాగ్రత్తలు పాటించాలని రైతులు, మత్స్యకారులకు సూచించారు. అవసరమైతే తప్పా చేపల వేటకు వెళ్లవద్దని కోరారు. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.