నివేదిక ఇవ్వాలని ఆదేశించిన డిప్యూటీ సీఎం
అమరావతి – పెందుర్తి ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా కొందరు విద్యార్థులు కాన్వాయ్ కారణంగా జేఈఈ పరీక్షను రాయలేక పోయారంటూ వచ్చిన వార్తా కథనాలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఇది వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. వెంటనే నివేదిక ఇవ్వాలని కోరారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ను నిలుపుదల చేశారు? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్‌ను ఏమైనా నియంత్రించారా? లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని స్పష్టంగా చెబుతూ ఉంటారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు గతంలోనే ఇవ్వడమైనదని తెలిపారు. అందుకు అనుగుణంగానే ప్రతీ పర్యటన సందర్భంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియచేస్తూ వచ్చామని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.