గ్రామీణ రహదారులకు మహర్దశ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన ఎన్డీయే సర్కార్ దూకుడు పెంచింది. ఓ వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంకో వైపు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పనుల ప్రగతిపై ఫోకస్ పెట్టారు.
పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖలపై సమీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చర్యలకు దిగారు. ప్రజలకు ఉపయోగపడే పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఉన్నతాధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
ప్రత్యేకించి రాష్ట్రంలో రోడ్లు, భవనాల పరిస్థితి దారుణంగా ఉందని తన దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు రోడ్లకు మహర్దశ తీసుకు వచ్చేలా తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా రూ.4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలన్నారు.
250కు మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం చేయాలన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడతామని స్పష్టం చేశారు కొణిదెల పవన్ కళ్యాణ్. కాగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (AIIB) అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు.