పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసంధ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ అమెరికన్ అసోసియేషన్ ప్రతినిధులు తనను కలిశారు. తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్బంగా సంస్థ అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (ఏఏఏ) వ్యవస్థాపకుడు హరి మోటుపల్లి, జాతీయ అధ్యక్షుడు బాలాజీ వీర్నాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని డిప్యూటీ సీఎం కు తెలిపారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
తెలుగు వారి ఐక్యత, తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విస్తృతంగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవాసాంధ్రులను కార్యోన్ముఖులను చేయాలని కోరారు.
సొంత ఊళ్లలో మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించేలా ఉత్తేజితులను చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్న తమ సంస్థ నేషనల్ కన్వెన్షన్ కు హాజరు కావాల్సిందిగా డిప్యూటీ సీఎంను ఏఏఏ నేతలు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు తాను కూడా వస్తానని హామీ ఇచ్చారు.