NEWSANDHRA PRADESH

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీగా పెరిగిన ఓట‌ర్లు

Share it with your family & friends

ముసాయిదా విడుదల చేసిన ఎన్నికల సంఘం

అమరావతి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్​లో సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే 19,048 మంది ఓటర్లు పెరిగారు. మే 13 నాటికి 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు చేరింది. అందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803 మంది ఉన్నారు . ఈ మేరకు

నవంబర్ 28 వరకూ ఈ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించనుంది ఈసీ. 2025 జనవరి 6న తుది జాబితా ప్రచురించనుంది. ఇందులో భాగంగా నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రత్యేక క్యాంపెయిన్‌ డేలు ఏర్పాటు చేయనుంది.

ఆయా తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితాతో సహా బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం అర్జీ చేసుకునేందుకు వీలుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు.

ముసాయిదా జాబితా ప్రకారం సాధార‌ణ ఓట‌ర్లు 4,13,53,792 ఉండ‌గా స‌ర్వీసు ఓట‌ర్లు 67,143 ఉన్నారు.
మొత్తం ఓటర్లు 4,14,20,935 ఉన్నార‌ని తెలిపారు. ఇందులో పురుష ఓట‌ర్లు 2,03,47,738, మహిళ ఓట‌ర్లు 2,10,69,803 థర్డ్‌ జెండర్ ఓట‌ర్లు 3,394 మంది ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇందులో 4 లక్షలకు పైగా యువ ఓటర్లు ఉన్నార‌ని, 18-19 ఏళ్ల వయోవర్గానికి చెందిన వారు 4,86,226 ఓట‌ర్లు ఉన్నారని, 6,13,970 మంది ఓటర్లు పెరిగిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్.

2024 జనవరిలో తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ చేరిన నూతన ఓటర్లు 10,82,841 మంది ఉన్నార‌ని పేర్కొన్నారు. 2024 జనవరిలో తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ జాబితాలో నుంచి 4,68,871 ఓట‌ర్ల‌ను తొలిగించామ‌న్నారు.

2024 జనవరిలో విడుదల చేసిన తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నికర పెరుగుదల 6,13,970 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 5,18,801 ఉండ‌గా రాష్ట్రంలోని మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 46,397 ఉన్నాయి.