NEWSANDHRA PRADESH

ఏపీలో నామినేష‌న్లు షురూ

Share it with your family & friends

అభ్య‌ర్థుల‌కు ఈసీ కీల‌క సూచ‌న‌లు

అమ‌రావ‌తి – రాష్ట్రంలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించి గురువారం నుంచి నామినేష‌న్లు స్వీక‌రించ‌డం ప్రారంభించింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఈ సంద‌ర్బంగా అభ్య‌ర్థుల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. పోటీ చేసే వారిలో ఒక‌రి వెంట ఐదుగురికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది ఈసీ. రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించి అనుమ‌తి తీసుకోవాల‌ని తెలిపింది.

అభ్య‌ర్థులు నామినేషన్ల దాఖలుకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకు రావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతించడం జరుగుతుంద‌ని పేర్కొంది ఈసీ. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలని వెల్ల‌డించింది.

నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, సెల‌వు రోజుల‌లో నామినేష‌న్ల‌ను స్వీక‌రించే ప్ర‌స‌క్తి లేద‌ని తెలిపింది. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చని పేర్కొంది ఈసీ.

కాగా 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించడం జ‌రుగుతుంద‌ని, 5 మంది వ్యక్తులు (అభ్యర్థితో సహా) ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చని సూచించింది.

నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొంది. ఇవి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుందని పేర్కొంది. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను అభ్యర్థి ఖాతాలో లెక్కించ‌నున్న‌ట్లు తెలిపింది.

ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి 40 లక్షల ఖర్చు పరిమితి, అలానే పార్లమెంట్ అభ్యర్థికి 95 లక్షల రూపాయల ఖర్చు పరిమితం చేసిన‌ట్లు తెలిపింది.