ఏపీలో ఓటుకు వేళాయె
ఓటు కోసం పోటెత్తారు
అమరావతి – ప్రచార పర్వానికి తెర పడింది. హామీల మూటలు గుమ్మరించారు ఆయా పార్టీలకు చెందిన నేతలు. ప్రధానంగా నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగింది. చివరకు ఎవరు గెలుస్తారనే దానిపై ఎవరికి తోచిన రీతిలో వారు చెబుతూ వెళ్లారు. ఇక సర్వే సంస్థలు, జాతీయ మీడియా , సామాజిక మాధ్యమాలలో ఈసారి టీడీపీ కూటమికే ఛాన్స్ అంటూ ఊదరగొట్టారు.
కానీ కోట్లాది మంది జనం మాత్రం మౌనంగా ఉన్నారు. ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామీణ , పట్టణ ప్రాంతాల ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది పక్కన పెడితే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక తాడో పేడో తేల్చుకుంటామని టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ప్రకటించింది.
గత ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీని. ఏకంగా ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసింది. కడప ఎంపీ స్థానానికి బరిలోకి దింపింది. మొత్తంగా ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠను రేపుతోంది.