ఏపీలో మే 13న ఎన్నికలు
ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించారు సీఈసీ రాజీవ్ కుమార్. ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు చేపడతామని తెలిపారు.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ , ఒడిశా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయని, అయితే యధావిధిగా లోక్ సభ ఎన్నికలు కూడా ఆయా రాష్ట్రాలలో ఉంటాయని స్పష్టం చేశారు రాజీవ్ కుమార్.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే మే 13న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 18న రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 175 శాసన సభ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. జూన్ 4వ తేదీన ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు కేంద్ర ఎన్నికల అధికారి.
ఎన్నికల సందర్భంగా బ్యాంకు ఖాతాల లావాదేవీలపై నిఘా పెడతామని హెచ్చరించారు. ఈసీ మార్గదర్శక సూత్రాలకు ఎవరు భంగం కలిగించినా చర్యలు తప్పవని అన్నారు.