సిస్కో ఏపీఎస్ఎస్ డీసీ ఎంఓయు
అమరావతి – రాష్ట్రం లోని వివిధ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య (డిగ్రీ, ఇంజనీరింగ్), వృత్తివిద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐటి సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షాన ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్‌ను అందిస్తుంది. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఏపీ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది.
ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితాను ఖరారు చేస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఈ ఒప్పందం ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ సహకారం లక్ష్యమని స్పష్టం చేశారు నారా లోకేష్.
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్య సామర్థ్యాన్ని పెంపొందించేలా సిస్కో వర్చువల్ విధానంలో NetAcad పోర్టల్ ద్వారా స్వీయ-అభ్యసన, బోధకుల నేతృత్వంలో ఇండస్ట్రీ ఎక్సోపోజర్ ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. విద్యార్థులకు ఆయా సంస్థల డిమాండ్ ఆధారిత కోర్సుల్లో శిక్షణా కార్యక్రమాలను డిజైన్ చేస్తారు. మారుతున్న సాంకేతికలకు అనుగుణంగా ముందస్తు అవసరాలకు సరిపడా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.