పంధ్రాగస్టున అన్న క్యాంటీన్లు ప్రారంభం
ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు అన్నార్థుల , పేదల, సామాన్యులకు తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. సోమవారం ప్రభుత్వం ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
అన్న క్యాంటీన్లకు సంబంధించి తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు.
మరుసటి రోజు ఆగస్టు 16న మిగతా 99 అన్న క్యాంటీన్లను ఏపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభిస్తారని రాష్ట్ర కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక వాటిని పక్కన పెట్టారు.
దీంతో వేలాది మంది ఆకలితో అలమటించారు. కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను మరింత రుచితో, నాణ్యవంతంగా ఉండేలా తీర్చి దిద్దాలని ఆదేశించారు. ఈ మేరకు అన్న క్యాంటీన్లు పేదల కడుపులు నింపనున్నాయి.