NEWSANDHRA PRADESH

ఏపీ టెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన రాష్ట్ర ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. పంతుళ్లు కావాల‌ని అనుకునే వాళ్లు త‌ప్ప‌నిస‌రిగా టెట్ (ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌) పాస్ కావాల్సి ఉంటుంది. లేక పోతే డీఎస్సీ రాసేందుకు వీలు ప‌డ‌దు. దీంతో టెట్ కు భారీ ఎత్తున డిమాండ్ ఉంటోంది.

రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కూట‌మి ప్ర‌భుత్వం విద్యా రంగంపై, కొలువుల భ‌ర్తీపై ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స‌మీక్ష చేప‌ట్టారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అభ్య‌ర్థుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ మేర‌కు ఏపీ టెట్ ప‌రీక్ష ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గాను గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల ఆగ‌స్టు 3 వ‌ర‌కు టెట్ ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా టెట్ ప‌రీక్ష‌కు సంబంధించి జూలై 2న నోటిఫికేష‌న్ జారీ చేసింది ప్ర‌భుత్వం.

అర్హులైన అభ్య‌ర్థులు గ‌డువు తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు పాఠశాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ విజ‌య రామ రాజు. ఇప్ప‌టి వ‌ర‌కు 3,20,333 మంది అప్లై చేసుకున్నార‌ని, టెట్ ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 3 నుండి 20 వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు.