ఉత్తమ ఎన్నికలు ర్వహించినందుకు అవార్డు
అమరావతి – రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత ఏడాది 2024లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను చిత్తూరు జిల్లా ఎస్పీ వీఎన్ మణికంఠ చందోలుకు అరుదైన పురస్కారానికి ఎంపిక చేసింది. ఈనెల 25న 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా విజయవాడలో జరిగే కార్యక్రమంలో తనకు అవార్డును అందజేయనున్నట్లు వెల్లడించింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఎస్పీ. ఈ మేరకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ఎన్నికల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు ఎస్పీ మణికంఠ చందోలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేశారు. ఇందుకు గాను ఎస్పీని ప్రత్యేకంగా అభినందించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఎల్లప్పుడూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు రక్షణ కల్పించడంలో కీలకమైన పాత్ర పోషించారు. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ పెట్టడంతో పాటు ట్రాఫిక్ ను నియంత్రించడం, రోడ్డు భద్రత, రక్షణకు సంబంధించి అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
కౌన్సిలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా 24 గంటల పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటున్నారు. పోలీసులంటే చాలా మంది జడుసుకుంటారు. తాము కూడా సమాజంలో భాగమేనంటూ మేము మీకోసమే ఉన్నామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులంతా తమ ఇంటి మనిషిగా మణికంఠ చందోలును భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.