ఏపీలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు
ప్రకటించిన కూటమి ప్రభుత్వం
అమరావతి – రాష్ట్రంలో బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌లో బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ. 1.03 లక్షల నుంచీ రూ. 1. 05 లక్షలు, కనిష్ఠంగా రూ. 40 వేలు చొప్పున నిర్ణయించారు.
రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్, 2 ఆర్చిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో రూ.40 వేల రుసుము ఉన్న కళాశాలలు 114, రూ. లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు చేశారు.
ట్యూషన్ , అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయని స్పష్టం చేసింది సర్కార్. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదని తెలిపింది.
వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డోనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలా చేసే వారిపై చట్ట ప్రకారం జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.