ఏపీ సర్కార్ ఖుష్ కబర్
దీపావళి నుంచి సిలిండర్ కానుక
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము చెప్పినట్టుగానే ఉచిత హామీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించారు సీఎం. ఇదిలా ఉండగా ఉచితంగా ఒక్కో మహిళ కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం వల్ల ఏపీ ఖజానాపై ఏడాదికి రూ. 2,684 కోట్లు ఖర్చు అవుతుందని, ఇది అదనపు భారం అవుతుందని వాపోయారు సీఎం.
అయినా తాము ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
మహిళా సంక్షేమానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ దీపం పథకం పకడ్బందీగా అమలు అయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం.