ఉచిత బస్సు పథకంపై సబ్ కమిటీ
ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి – ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో పాటు హోం, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఫ్రీ బస్ స్కీం అమలవుతున్న రాష్ట్రాలలో పర్యటించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించారు టీడీపీ బాస్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు మొత్తం ఆరు గ్యారెంటీలను ఇస్తామన్నారు.
ఇందులో భాగంగా బాలికలు, యువతులతో పాటు మహిళలను సమున్నతంగా నిలదొక్కుకునేలా, సాధికారత దిశగా సాధించేలా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ప్రయాణం చేసేలా స్కీం తీసుకు వస్తామని తెలిపారు. ఈ మేరకు ఎంత ఖర్చవుతుందనే దానిపై ఆరా తీశారు.
ఇదే సమయంలో ఫ్రీ బస్సు సర్వీసును ముందుగా దేశంలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ సిద్దిరామయ్య సర్కార్ అమలు చేస్తోంది. తాజాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది.