మాజీ డీజీ వెంకటేశ్వర్ రావుకు రిలీఫ్
కేసుల ఉపసంహరణకు సర్కార్ ఓకే
అమరావతి – మాజీ ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్ రావుకు భారీ ఊరట లభించింది. వెంకటేశ్వరరావుపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు చేయడంతో పాటు పోస్టింగ్ ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టింది.
తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కాగా టీడీపీకి వెంకటేశ్వర్ రావు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి తమను కావాలని టార్గెట్ చేశారంటూ వాపోయారు బాధితుడు. ఆయన పోలీస్ రూల్స్ కు విరుద్దంగా మీడియాతో మాట్లాడారు. అంతే కాదు వ్యవస్థల డొల్లతనాన్ని బయట పెట్టారు.
ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలని అప్పటి సీఎం జగన్ రెడ్డి ఆదేశించారు. దీంతో తనపై పలు కేసులు నమోదు చేశారు. చివరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వర్ రావుకు తాను కోరుకున్న ప్రభుత్వం తిరిగి ఏపీలో కొలువు తీరింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
దీంతో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సర్కార్ లైన్ క్లియర్ చేసింది. కేసులను ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటించింది.