NEWSANDHRA PRADESH

ఆక్వా రంగంపై ఏపీ ఫోక‌స్

Share it with your family & friends

9వ ఆక్వా సాధికార‌త క‌మిటీ

అమ‌రావ‌తి – రాష్ట్రంలో ఆక్వా రంగంను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని ఆక్వా సాధికారిత కమిటీ పేర్కొంది. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అధ్యక్షతన 9వ ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. ఆక్వా రైతాంగానికి అండగా నిలిచేందుకు సీఎం వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆక్వా సాధికారిత కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఆక్వా రంగంలో సమస్యలను సమీక్షించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

అధికారులు సైతం మార్కెట్ రేట్లను, అంతర్జాతీయంగా ఆక్వా రంగంలో ఏర్పడే ఒడిదొడుకులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, రైతులు నష్ట పోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ధరల స్థిరీకరణ కోసం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సీడ్, ఫీడ్ ధరలు, ఆక్వా ఉత్పత్తులకు సరైన రేటు, దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగంను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను కమిటీకి అధికారులు వివరించారు. ఆక్వా సాధికారిత కమిటీ ఏర్పాటైన తరువాత ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

అటు ఆక్వా రైతులను, ఇటు సీడ్, ఫీడ్ తయారీ సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వాహకులను సమన్వయం చేసుకుంటూ మార్కెట్ లో రైతులకు నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దీనిఫలితంగా ప్రస్తుతం మార్కెట్ లో ఆక్వా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయని అన్నారు. అలాగే ఇష్టా రాజ్యంగా సీడ్, ఫీడ్ రేట్లను పెంచకుండా శాస్త్రీయంగా వాటిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.