పీఆర్ఓ పోస్టులకు ప్రభుత్వం ఆహ్వానం
మీడియా ప్రొఫెషనల్స్ కు ప్రాధాన్యత
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మీడియా , ప్రచురణ, డిజిటల్ మీడియాలో అనుభవం కలిగిన ప్రొఫెషనల్ జర్నలిస్టులకు తీపి కబురు చెప్పింది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, టీడీపీ బాస్, సీఎం నారా చంద్రబాబు నాయుడు కొలువు తీరారో ప్రచారానికి ఎక్కువ ప్రధాన్యత చోటు చేసుకుంది.
ముందు నుంచీ ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తూ వస్తున్నారు సీఎం. ఇందులో భాగంగా కీలకమైన మార్పులు తీసుకు వచ్చారు రాష్ట్రంలో. చంద్రబాబు ఎక్కడ ఉన్నా సరే మీడియా ఉండాల్సిందే. కెమెరాలు తళుక్కున మెరవాల్సిందే. ప్రచారం రావాల్సిందే.
ఇందుకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం కేబినెట్ లో 24 మంది మంత్రులకు సంబంధించిన పేషీ (కార్యాలయాలు)ల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్ఓ) పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ పాసై, మీడియా రంగంలో 5 ఏళ్ల పాటు పని చేసిన అనుభవం కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి నెలా రూ. 37 వేల వేతనం ఉంటుందని స్పష్టం చేశారు.