అన్న క్యాంటీన్ల కోసం రూ. 189 కోట్లు
ఆర్థిక శాఖకు ప్రతిపాదించిన సర్కార్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేసిన అన్న క్యాంటీన్లను ప్రస్తుతం కొత్తగా కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరుతో ఏర్పాటు చేసిన పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇందులో భాగంగా పేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన అన్న క్యాంటీన్ల పునరుద్దరణకు తక్షణమే రూ. 189.22 కోట్లు అవసరమని పురపాలిక, పట్టణాభివృద్ది శాఖ అంచనాలు వేసింది. ఆర్థిక శాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించనున్నారు.
ఆ వెంటనే యుద్ద ప్రాతిపదికన అన్న క్యాంటీన్లను ప్రజలకు అందుబాటు లోకి తీసుకు రావాలని భావిస్తోంది ఏపీ టీడీపీ కూటమి. తొలి దశలో 183 క్యాంటీన్లను పునరుద్దరించనున్నారు. ఈ మేరకు ఇంజనీర్లు అంచనా వేశారు. ఆర్థిక శాఖకు నిధుల మంజూరు కోసం ప్రతిపాదించారు.