సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఖుష్ కబర్
సమ్మె కాలపు వేతనాలు విడుదల
అమరావతి – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆద్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పని చేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేసిన కాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.
ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల తమ గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో 20 డిసెంబరు 2023 నుండి 10 జనవరి 2024 వరకు 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు.
ఈ సమ్మె తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని 23 శాతం పెంచుతూ జనవరి 2024లో ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఆ మెమోలో 2019కు ముందు గౌరవ వేతనం పెంచని వాళ్లకు 23 శాతం పెంచడం జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 21 రోజులు సమ్మె కాలానికి గానూ వేతనం చెల్లించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ ను సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిశారు. ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి వేతనాలు విడుదల చేయడానికి సహృదయంతో అంగీకరించారు. సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ వేతనాలు ఇవాళ విడుదల చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు ఉద్యోగులు.