సునీల్ కుమార్ కు సర్కార్ బిగ్ షాక్
వేటు వేసిన కూటమి ప్రభుత్వం
అమరావతి – గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తోంది తెలుగుదేశం , జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే రెడ్ బుక్ లో తాము రాసుకున్న వారి భరతం పడతామంటూ సంచలన ప్రకటన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేష్. ఇందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు పనులు చేసుకుంటూ పోయిన ఐపీఎస్ ఆఫీసర్లపై వేటు వేసేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే వారిని వీఆర్ లో ఉంచారు ఏపీ డిజీపీ ద్వారకా తిరుమల రావు.
తాజాగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో సీనియర్ ఐపీఎస్ , డీజీ ర్యాంక్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్ పై వేటు వేసింది సాధారణ పరిపాలన శాఖ. అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ప్రకారం వాటిని ఉల్లంఘించినందుకు ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలను తీసుకుంటూ జీవో ఆర్‌టి నెం 1695 జారీ చేసింది.
అయితే ప్రస్తుతం ప్రభుత్వ వెబ్‌సైట్ లో ఈ ఉత్తర్వులను కాన్ఫిడెన్షియల్ క్రింద అప్‌లోడ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సునీల్ కుమార్ పై గుంటూరుజిల్లా నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం విదితమే.
మరి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.