టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వేటు
శ్యామలారావుకు బాధ్యతలు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నమ్ముకున్న దేవ దేవుడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భక్తులు భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధర్మా రెడ్డిపై వేటు వేశారు. చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ వస్తూనే ఉన్నారు.
జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా, ఎలాంటి అర్హత లేక పోయినా గత కొన్నేళ్లుగా అంతా తానై వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు ఏవీ ధర్మా రెడ్డి. ఆయనపై తీవ్రమైన విమర్శలు, కోర్టుల దాకా వెళ్లాయి. అయినా ఎక్కడా తగ్గలేదు.
ఏపీలో జగన్ సర్కార్ కు జనం ఝలక్ ఇవ్వడంతో టీడీపీ కూటమి కొలువు తీరింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమలను దర్శించుకున్నారు. ఇక నుంచి ఓం నమో వేంకటేశాయ నమః అనే స్మరణ తప్ప వేరే వినిపించేందుకు వీలు లేదని హెచ్చరించారు. ఇదే సమయంలో ఈవో ధర్మా రెడ్డిని తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలా రావును నియమించారు.