ENTERTAINMENT

హైకోర్టులో రామ్ గోపాల్ వ‌ర్మ‌కు చుక్కెదురు

Share it with your family & friends

అరెస్ట్ నుంచి ర‌క్షించ లేమ‌న్న హైకోర్టు

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది హైకోర్టు. ఇందుకు సంబంధించి ఆయ‌న అరెస్ట్ ను ఆప‌లేమంటూ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అరెస్ట్ నుంచి ర‌క్షించ లేమంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

ఇదిలా ఉండ‌గా గ‌త వైసీపీ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌స్తుత సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఇందుకు సంబంధించి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న పోస్టులు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. వీటిని ఆధారంగా చేసుకుని ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు.

అరెస్ట్ నుంచి త‌న‌ను ర‌క్షించాల‌ని రామ్ గోపాల్ వ‌ర్మ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు పేర్కొంది కోర్టు. బెయిల్ పిటిష‌న్ వేసుకోవాల‌ని సూచించింది. కాగా గత ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించ పరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.