బాధితుల ఆవేదన మంత్రి ఆలంబన
ప్రజావేదికలో పాల్గొన్న అనిత వంగలపూడి
అమరావతి – రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తనను కలిసిన బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం మంగళగిరిలో ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అనిత.
ఈ సందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు వంగలపూడి అనితను. వచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. ఆ వెంటనే సంబంధిత సమస్యలకు సంబంధించిన ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపించారు. వెంటనే పరిష్కరించాలని సూచించారు.
తన శాఖా పరంగా వచ్చిన వినతులపై కూడా స్పందించారు. ఏ ఒక్కరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు వంగలపూడి అనిత. గత వైసీపీ సర్కార్ చేసిన నిర్వాకం కారణంగానే ఇవాళ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
కానీ తమ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ది పథంలోకి రాష్ట్రాన్ని తీసుకు పోయేందుకు తమ నాయకుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ఓ వైపు వరదలు, ఇంకో వైపు సమస్యలతో సతమతం అవుతున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా పని చేశారని పేర్కొన్నారు అనిత వంగలపూడి.