NEWSANDHRA PRADESH

తుపాను ప్ర‌భావం అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం – అనిత‌

Share it with your family & friends

జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడిన హోం శాఖ మంత్రి

అమ‌రావ‌తి – ఫెయింజల్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర‌ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.

అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. తిరుపతి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది సహా నాయుడుపేట,పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకల పరిసరాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్రం ముందుకొచ్చి ముంపున‌కు గురైన నేపథ్యంలో ప్రభావిత గ్రామాల ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌.

తిరుపతి, తిరుమల ప్రాంతాలలో వర్షాల ధాటికి కొండచరియలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రత పట్ల దృష్టి పెట్టాలని అన్నారు.