హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – నేరాల నియంత్రణలో టెక్నాలజీ కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు మంత్రి వంగలపూడి అనిత. శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడవద్దని పోలీసులకు సూచించారు. చిన్నారులు, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రతి 3 నెలలకోసారి శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష చేపడతామన్నారు. పటిష్ట భద్రతతో శాసనసభ సమావేశాల నిర్వహణ అభినందనీయమన్నారు. నేరం జరగగానే నిందితులను పట్టుకోవడం పట్ల డీజీపీని, పోలీసులను ప్రశంసించారు మంత్రి.
‘హెల్మెట్’ ధరించని వారిపట్ల సున్నితంగా వ్యవహరించాలని సూచించారు హోం మంత్రి. రౌడీయిజం తగ్గించే దిశగా రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన సమీక్ష నిర్వహించారు. సీసీటీవీలు, డ్రోన్ల వంటి టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటే నేరాలను మరింత తగ్గించవచ్చన్నారు. . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 25,26 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు కూడా సమర్థవంతంగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పురోగతిపై హోం మంత్రి జిల్లాల ఎస్పీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలలో ఇప్పటికే సుమారు 24వేల సీసీ కెమెరాలు బిగించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ తెలిపారు. జిల్లాల వారీగా డీజీపీ హరీష్ గుప్తా ఇచ్చిన లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేస్తున్నట్లు హోంమంత్రికి ఎస్పీలు వివరించారు. అవసరమైన చోట కఠినంగా ఉంటూనే కొన్నిచోట్ల పట్టువిడుపుతో వ్యవహరించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పోలీసులు నిర్వహిస్తున్న హెల్మెట్ డ్రైవ్‌ను హోంమంత్రి ప్రశంసించారు.