ప్రవేశ పెట్టిన హోం మంత్రి అనిత
అమరావతి – శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు హోం మంత్రి అనిత వంగలపూడి. దీనిని ఏకగ్రీవంగా ఆమోదించింది మండలి. ప్రతిపాదనకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాటలను ప్రస్తావించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని బోధించే మతం నాకిష్టం. న్యాయమెల్లప్పుడూ సమానత్వం, పరిహారం, నిష్పత్తి అని రేకెత్తించింది.సంక్షిప్తంగా న్యాయం అనేది స్వేచ్ఛ, సమానాత్వం, సౌభ్రాతృత్వానికి మారు పేరు అంటూ పేర్కొన్నారు. 1996లో న్యాయమూర్తి రామచంద్ర రాజు కమిషన్ నేతృత్వంలో ఎస్సీ ఉప కులాలను నాలుగు వర్గాలుగా విభజించారని తెలిపారు.
ఇందులో భాగంగా ఏ కేటగిరి కింద రెల్లీ, 12 ఉపకులాలు, బీ కేటగిరిలో మాదిగతో పాటు 18 ఉప కులాలు, సీ కేటగిరి కింద మాల, 25 ఉప కులాలు, డీ కేటగిరి కింద 4 ఆది ఆంధ్ర సహా ఉప కులాలు చేర్చారని చెప్పారు మంత్రి వంగలపూడి అనిత. కులం, ఆ సమూహం తగిన ప్రాధాన్యం పొందలేక పోవడానికి వెనుకబాటు తనానికి కారణమని రాష్ట్రం నిరూపిస్తే ఉపకులాల విభజనకు అవకాశం ఉంటుందన్నారు. ఏక సభ్య కమిషన్ ప్రధాన సిపార్సులను సభ ముందుకు తీసుకు రావడం జరిగిందన్నారు. కమిషన్ నివేదికను అధ్యయనం, ప్రభుత్వ సూచనలు, సిఫారసులకు మంత్రుల నేతృత్వంలో కమిటీని సర్కార్ నియమించిందన్నారు.
మంత్రుల కమిటీలో సభ్యులుగా డోలా బాల వీరాంజనేయస్వామి, అనిత, బీసీ జనార్థన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్ ను నియమించడం జరిగిందన్నారు. ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎవరికైనా అభ్యంతరాలున్నా లేదా వివరణ కావాలన్నా సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలాంటి సమాధానం లేక పోయే సరికి ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి మండలి ఆమోదం తెలపడం పట్ల ధన్యవాదాలు తెలిపారు స్పీకర్.