రైతులకు మరో ఐదేళ్లు కౌలు పొడిగింపు
ప్రకటించిన ఏపీ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు తీపి కబురు చెప్పారు. ఈ మేరకు పొలాలు ధారదత్తం చేసిన రైతులకు మరో ఐదు సంవత్సరాల పాటు కౌలు ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
సీడ్ కేపిటల్ నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం తో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు పొంగూరు నారాయణ. జాతీయ రహదారి – 16 ను కలిపేలా అమరావతి నుంచి మరో నాలుగు రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
గతంలో భూములు కేటాయించిన సంస్థలు త్వరగా ఏర్పాటు చేసేలా సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు ఏపీ మంత్రి.
అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీయే అధారిటీ కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో 11 అంశాలను అజెండాలో చర్చించిడం జరిగిందన్నారు.
ఆనాడు చంద్రబాబు అడిగిన వెంటనే 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు పొంగూరు నారాయణ. గత వైసీపీ సర్కార్ రైతులను ఇబ్బందులకు గురి చేసింది తప్పా ఆదుకోలేదన్నారు.
రైతులకు ప్రతి ఏటా ఇచ్చే కౌలు తో పాటు పెన్షన్ల ను మరో ఐదేళ్లు పొడిగించాలని సీఆర్డీయే అధారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.