సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
అమరావతి – ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు సత్య కుమార్ యాదవ్.
ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత పైనా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికి సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు మంత్రి. ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు సత్య కుమార్ యాదవ్.
మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ, వాడకంపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ హాస్టల్ లో తీసుకోవాల్సిన చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి.