డయేరియా బాధితులకు మంత్రి పరామర్శ
ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ
అమరావతి – ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం ఆకస్మికంగా పల్నాడు జిల్లాలో పర్యటించారు. ప్రధానంగా డయేరియా కేసులు పెరుగుతుండడంతో ఆయన రంగంలోకి దిగారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో పర్యటించారు సత్య కుమార్ యాదవ్.
డయేరియా ప్రభావం ఎక్కువగా ఉన్న అంజనీపురం కాలనీలో పర్యటించి బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు.
డయేరియాతో చనిపోయిన బండారు పెద వీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చారు మంత్రి. ప్రభుత్వం తరపున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న బోరును పరిశీలించి.. నీటి కాలుష్యానికి గల కారణాలపై వివరాలు తెలుసుకున్నారు సత్య కుమార్ యాదవ్.
వైద్య శిబిరాలను సందర్శించి డాక్టర్లతో మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరాలు కొనసాగించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇంటింటికీ వెళ్లి మందుల కిట్లు అందించాలని, డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని సూచించారు.
గ్రామంలోని ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచు కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.