ఏపీ పంచాయతీరాజ్ వరల్డ్ రికార్డ్
ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ
అమరావతి – ఏపీ పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ శాఖను ప్రత్యేకంగా తీసుకున్నారు ప్రముఖ నటుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.
ఇందులో భాగంగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల లోపే అరుదైన ఘనతను సాధించింది రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ. ఏకంగా వరల్డ్ రికార్డ్ సాధించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించింది. అంతే కాకుండా వరద బాధిత ప్రభావిత ప్రాంతాలలో 400 గ్రామ పంచాయతీలు తీవ్రంగా నష్ట పోయాయి. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ఒక్కో పంచాయతీకి తన వంతుగా రూ. లక్ష చొప్పున రూ. 4 కోట్ల రూపాయలు సాయంగా ప్రకటించారు.
కాగా ఒకే రోజు 13, 326 రోజులలో ఏక కాలంలో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది.
ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు.
హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.